ఏదులాపురం మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాము అని మంత్రి అన్నారు

ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాం… రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

రూ. 38 కోట్లతో మద్దులపల్లి నుంచి గొల్లగూడెం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం

ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే రూ. 75.50 కోట్ల నిధులు మంజూరు

ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు

ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఏదులాపురం, అక్టోబర్ 25// మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు//

ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనితతో కలిసి పర్యటించిన మంత్రి, రూ.38 కోట్లతో మద్దులపల్లి నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులతో పాటు రూ.కోటి వ్యయంతో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రూ.38 కోట్లతో చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి నిర్మాణం పూర్తయితే ఏదులాపురం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మద్దులపల్లి నుంచి గొల్లగూడెం వరకు నిర్మించనున్న ఈ రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నా మని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం రూ.75.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేటాయింపులు జరిగాయని వివరించారు. రహదారులు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధి తదితర మౌళిక సదుపాయాలను మెరుగుపరిచి పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఆర్థిక సవాళ్ల మధ్యనూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమాంతరంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు.

గత పాలకులు సృష్టించిన ఆర్థిక అవరోధాలను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతి దశలో అండగా నిలుస్తుందని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

వానాకాలంలో రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడదని స్పష్టం చేశారు. పంటలకు అవసరమైన నీరు, విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే, రానున్న కాలంలో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు.

ప్రజల అవసరాలపై ముందస్తు కార్యాచరణ: సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

తెలంగాణకు కేంద్రం సహకరించాలి:
సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా తెలంగాణకు ఎలాంటి వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణకు అవసరమైన సహాయం అందేలా బీజేపీ ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి తగిన మద్దతు లభించేలా కృషి చేయాలని కోరారు. కరువు పరిస్థితులను గతంలో ఎదుర్కొన్న అనుభవం రైతులకు ఉందని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించినట్లు తెలిపారు. గిరిజన భవన్, వసతి గృహం, వివిధ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. రూ.38 కోట్లతో చేపట్టనున్న రహదారి నిర్మాణం ఎంతో ప్రాధాన్యత కలిగిన పనిగా పేర్కొంటూ, మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగించి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలకు దీర్ఘ కాలికంగా ఉపయోగపడేలా పనులు చేపట్టాలని తెలిపారు.

ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. మంత్రి దూరదృష్టి, అభివృద్ధి పట్ల ఉన్న ఆలోచనలతో మున్సిపాలిటీలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత లభిస్తోందని పేర్కొన్నారు. ఏదులాపురం అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ ఎన్. శ్రీనివాస్, ఏదులాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.

  • Related Posts

    సత్తుపల్లి పట్టణంలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

    సత్తుపల్లిలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకలు విజేత జట్లకు బహుమతులు అందజేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా.. సత్తుపల్లి, అక్టోబర్ 30 మన జ్యోతి ప్రతినిధి వెంపటి…

    రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అభిమానులు

    🌧️ జోరు వానను సైతం లెక్కచేయకుండా రక్తదాన శిబిరానికి తరలివచ్చిన పొంగులేటి అభిమానులు! సేవా స్ఫూర్తికి వర్షం అడ్డుకాదు.. ప్రాణదానానికి అభిమానుల ముందడుగు! తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సత్తుపల్లి పట్టణంలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

    • By Naidu
    • October 30, 2026
    • 6 views
    సత్తుపల్లి పట్టణంలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

    రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అభిమానులు

    • By Naidu
    • October 28, 2026
    • 20 views
    రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అభిమానులు

    అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి మంత్రి అన్నారు

    • By Naidu
    • October 26, 2026
    • 18 views
    అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి మంత్రి అన్నారు

    ఏదులాపురం మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాము అని మంత్రి అన్నారు

    • By Naidu
    • October 25, 2026
    • 19 views
    ఏదులాపురం మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాము అని మంత్రి అన్నారు

    ఏసీబీకి పట్టుబడ్డ తాసిల్దార్ సర్వేయరీ

    • By Naidu
    • October 16, 2026
    • 35 views
    ఏసీబీకి పట్టుబడ్డ తాసిల్దార్ సర్వేయరీ

    ఖమ్మం నగరంలో అల్లిపురం కొత్తగూడెం కొత్తూరు ప్రాంతంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన కార్యక్రమం

    • By Naidu
    • October 12, 2026
    • 34 views
    ఖమ్మం నగరంలో అల్లిపురం కొత్తగూడెం కొత్తూరు ప్రాంతంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన కార్యక్రమం