ఖమ్మం ఆగస్టు 3 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు




వైద్య కళాశాల, యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు
వైద్య కళాశాల పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలి
హాస్టళ్లు సెప్టెంబర్‌లో, అడ్మిన్ బ్లాక్ అక్టోబర్‌లో, అన్ని పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి
ఖమ్మం, ఆగస్టు 3:
ప్రభుత్వ వైద్య కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.
సోమవారం రఘునాథపాలెంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, సిపి సునీల్ దత్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (షెడ్యూల్) సిద్ధం చేయాలని సూచించారు. వైద్య కళాశాల ప్రహరీ గోడ, హాస్టల్, అంతర్గత రహదారులు పూర్తి చేయాలని, అవసరమైన నిర్మాణ పనులకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు నిరంతరం ఫాలోఅప్ చేసి త్వరితగతిన ఆమోదాలు పొందాలని అధికారులను ఆదేశించారు.
బాలికల హాస్టల్ నిర్మాణాన్ని సెప్టెంబర్ 1 నాటికి పూర్తి చేయాలని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహతో టెలిఫోన్‌లో మాట్లాడి ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనుల పూర్తి కోసం అదనంగా రూ.64 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని, ప్రధానంగా విద్యుత్, మౌళిక సదుపాయాల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, నిధులు మంజూరైతే పూర్తి చేసి కళాశాలను ప్రారంభించే అవకాశం ఉంటుందని వివరించారు.
ముందుగా గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌కు సంబంధించిన విద్యుత్ పనులను పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి సిద్ధం చేయాలని, సెప్టెంబర్‌లో హాస్టళ్ల నిర్మాణం, అక్టోబర్‌లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పనులు పూర్తి చేసి, డిసెంబర్ చివరి నాటికి అన్ని నిర్మాణాలను పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు.
ఖమ్మంలో ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో అప్పటిలోగా అన్ని పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. నిర్మాణ పనులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే జిల్లా కలెక్టర్, తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే వైద్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వైద్య కళాశాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని సూచించారు.
అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, మొత్తం 17 బ్లాకులు, పేరెంట్స్ లాంజ్, కిచెన్, డైనింగ్ హాల్‌తో పాటు అన్ని నిర్మాణాలను నాణ్యతతో పూర్తిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా హాస్టళ్లు, అకడమిక్ బ్లాకులు, అంతర్గత రహదారులు, ఇతర మౌళిక సదుపాయాల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని పూర్తిచేసి సంబంధిత శాఖకు అప్పగించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అన్ని పనులను సమయానికి పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి, ఆర్డీఓ శ్రీనివాస్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, వైద్య శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
O





