ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం

-ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు.

ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, మహిళా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ ఉద్యోగుల బహిరంగ సభను విజయవంతం చేయాలని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో ఈనెల 10వ తారీఖున జరగనున్న ఉద్యోగుల సభకు మద్దతుగా టీజీఈ జేఏసీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌ ఖమ్మంలో భారీ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సన్నాహక సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, మహిళా ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సమావేశం అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు.

హైదరాబాద్ ఉద్యోగుల సభకు భారీగా హాజరు కావాలి – మారం జగదీశ్వర్

జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, ముందుగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, ఉద్యోగుల ఉద్యమాలకు ఖమ్మం జిల్లా ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగులే ఇప్పుడు తమ న్యాయమైన హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. 206 ఉద్యోగ సంఘాలతో టీజీఈ జేఏసీ ఏర్పడిందని, ప్రతి సంఘం సొంత ఎజెండాతో కాకుండా ఉమ్మడి ఎజెండాతో ముందుకు సాగాలని సూచించారు. విడివిడిగా పోరాటాలు చేయడం వల్ల కంటే జేఏసీ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తేనే సమస్యలకు బలమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

“జేఏసీకి నాయకుడిగా నేను ఒక విమానాన్ని నడుపుతున్నాను. ఆ విమానంలో జేఏసీకి చెందిన ప్రతి ఉద్యోగి ఉన్నారు. ఆ విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకు మీ అందరి సహకారం అవసరం” అని మారం జగదీశ్వర్ ఉద్యోగులను ఉద్దేశించి ఉత్సాహపరిచారు.

ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, ఉద్యోగులు–ప్రభుత్వం కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరుతాయని అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పడం కొంచెం విడ్డూరంగా ఉంది. మొదటి తారీకు జీతం ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత అని, ఉద్యోగుల కృషి వల్లే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఈనెల 10న హైదరాబాద్‌లో జరిగే సభకు ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు అనుమతి విషయంలో ఏదైనా సమస్య ఎదురైనా శాంతియుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, వారు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి తమ గోడును వినిపిస్తామని చెప్పారు. “ముఖ్యమంత్రి గారే మా తల్లి, మా తండ్రి. మా సమస్యలు, మా గోడు ఆయనకే వినిపిస్తాం” అని అన్నారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు రూ.12 వేల కోట్ల బకాయిలను జేఏసీ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం చెల్లించడం సంతోషకరమన్నారు. హెల్త్ కార్డులు అందించడం కూడా స్వాగతించదగిన చర్యేనని, అయితే కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు సక్రమంగా స్పందించకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులు మెరుగైన వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఔట్సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం అమలుపై తీసుకున్న చర్యలను పరిశీలించి, తెలంగాణలో కూడా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సీపీఎస్ రద్దుకు చర్యలు చేపట్టాలని కోరారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, పోరాటం నుంచి వచ్చిన నాయకుడిగా ఉద్యోగుల కష్టాలు, సమస్యలను అర్థం చేసుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని మారం జగదీశ్వర్ తెలిపారు.

*ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ స్వయంగా పాటలు పాడుతూ ఉద్యోగులను ఉత్సాహపరిచారు. ఉద్యోగులు, సంఘాల నాయకులు పెద్దఎత్తున స్పందించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పీఆర్సీ వెంటనే ఇవ్వాలి.. పెండింగ్ డీఏలు విడుదల చేయాలి-ఏలూరి

టీజీఈ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ “ఖమ్మం ఉద్యమాల గుమ్మం. ఖమ్మం జిల్లా ఉద్యోగులకు ఉద్యమాలు కొత్త కాదు” అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఖమ్మం జిల్లా ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

జేఏసీ ప్రకటించిన 64 డిమాండ్లలో అనేకం ప్రభుత్వం పరిష్కరించిందని, ఇంకా మిగిలిన ప్రధాన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. పీఆర్సీ నివేదిక ఆలస్యం కావడంతో ఉద్యోగులు ఇప్పటికే సుమారు మూడు సంవత్సరాల పీఆర్సీ ప్రయోజనాన్ని కోల్పోయారని తెలిపారు. వెంటనే పీఆర్సీ నివేదికను అందించి, రెండు నెలల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. డీఏలను జీపీఎఫ్‌లో జమ చేయడంతో పాటు సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాలని సూచించారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు రూ.10 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెల రూ.2 వేల కోట్ల చొప్పున బకాయిలను చెల్లించి ఉద్యోగులకు ఊరట కల్పించాలని కోరారు.

ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకంతో ఇప్పటివరకు ఓపిక పట్టామని, ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు, ఉద్యోగుల కుటుంబాల్లో కూడా పండగ వాతావరణం తీసుకురావాలని అన్నారు.

“మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తే 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి అండగా ఉంటారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు.. ప్రభుత్వంలో భాగస్వాములమే” అని స్పష్టం చేశారు.

వాట్సాప్‌లో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య దూరం పెంచేలా కొందరు అనుచిత సందేశాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. మంత్రులను, వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించే విధానాన్ని టీజీఈ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. తమ ఉద్యమం గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటమని స్పష్టం చేశారు.

“ఈనెల 10న హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులతో నిర్వహించే సభ కంటే, ముందుగానే ప్రభుత్వం స్పందించి, ఆ సభను అభినందన సభగా మారుస్తుందా.. లేక ఉద్యోగుల నిరసన సభగా మారుస్తుందా అన్నది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి” అని ఏలూరి శ్రీనివాసరావు అన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు

సమావేశంలో భాగస్వామ్య ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, రెండో పీఆర్సీ నివేదికను వెంటనే తీసుకుని అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 10న హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయులు, గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు చావ రవి, దామోదర్ రెడ్డి, సదానంద గౌడ్, శ్రీనివాస్ రెడ్డి,కొంగర వెంకటేశ్వరరావు, కొనిదెన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి, అమరనేనీ రామారావు, పుల్లయ్య, కృష్ణ చైతన్య భార్గవ్, సుబ్బయ్య, పరిష పుల్లయ్య, కళ్యాణం నాగేశ్వరరావు, గోపీచంద్, వేణు, శ్రీమతి ఏసుపాదం, రమణ యాదవ్, బిక్కు, వెంకటరమణ, కోటి లింగయ్య, వెంకటేశ్వర్లు, బెజ్జంకి ప్రభాకర చారి, తాళ్లూరి శ్రీకాంత్, కట్ట శేఖర్, టిపిటిఎఫ్ విజయ్, ఎలమద్ది వెంకటేశ్వర్లు, హరికృష్ణ కోణార్, కొమరగిరి దుర్గాప్రసాద్, జెడ్ఎస్ జైపాల్, దుర్గ భవాని, పారుపల్లి నాగేశ్వరరావు, ఎస్.కె. రంజాన్, ఎర్ర రమేష్, శ్రీధర్ సింగ్, పెద్దినేని రాధాకృష్ణ, బుస చంద్రశేఖర్, కోటపాటి రుక్మారావు, అస్లాం, గుర్రం శ్రీనివాసరావు, విజయ, రాధికా రెడ్డి, కోమలి,వీరన్న, కృష్ణ, మున్సిపల్ సుధాకర్, బుర్రి వెంకటేశ్వర్లు, జి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించారు.భారీ సంఖ్యలో ఉద్యోగులు హాజరైన ఈ సన్నాహక సమావేశం విజయవంతంగా జరిగింది.

  • Related Posts

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మంత్రి తుమ్మల విశేష కృషి… గిరిజన ప్రాంతంలో విద్యాజ్యోతి – అంతర్జాతీయ ప్రమాణాలతో స్వామి నారాయణ్ గురుకుల పాఠశాల– ఏళ్ల నాటి కల సాకారం– రఘునాథపాలెంలో 13 ఎకరాల్లో గురుకుల్‌ పాఠశాల– 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన–…

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    ఖమ్మం కార్పొరేషన్ ఆగస్టు 6 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు పేదల పక్షపాతి, నిజమైన ప్రజా నాయకులు కీ.శే పల్లా జాన్ రాములు గారి మనవరాలు, ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ కుమార్తె పల్లా హాసిని పుట్టినరోజు సందర్భంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 11 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 12 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 30 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 24 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 59 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 46 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి