
₹9 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్!
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ అవినీతి ఆరోపణలతో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వలలో చిక్కాడు.అధికారదుర్వినియోగానికి పాల్పడుతూ రూ.9 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
బిఏసీబీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం…
హైదరాబాద్‌లోని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బతుల మహేందర్ ఒక సైబర్ మోసం కేసులో ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను కేసులో ఇరికించకుండా ఉండేందుకు అధికార అనుకూలత పేరుతో రూ.9 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి ఇప్పటికే రూ.5 లక్షలు నగదు రూపంలో తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. మిగిలిన రూ.4 లక్షల కోసం మరోసారి ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు పాల్పడిన సమయంలో, 2026 మే 30న ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) అధికారులు అతడిని కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు.
తదుపరి దర్యాప్తులో భాగంగా ఇన్‌స్పెక్టర్ నివాసంలో సోదాలు నిర్వహించగా, లెక్కల్లో చూపని రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, కొన్ని ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆస్తులపై మరింత విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన ఇన్‌స్పెక్టర్‌ను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది.






